పట్నంలో ‘డాబా పొలం’!
ఇంటి పంట 23-04-2011

కిచెన్ గార్డెనింగ్ చేపడుతున్న వారిలో ప్రతి ఒక్కరిదీ ఒక్కో విభిన్న శైలి. రెండంతస్తుల భవనం పైన కుండీలో, మడులో పెట్టడం కాకుండా.. టెరస్ ్రమొత్తాన్నీ పూర్తి స్థాయి పొలంగా మార్చేశారు శెట్టి శశికాంత్ కుమార్.

బ్రిటన్ నుంచి తెప్పించిన పోలివినిల్ రసాయనంతో పొరను వేసిన తర్వాత.. దానిపై పకడ్బందీగా డాబా పొలం సిద్ధమైంది. ప్రత్యేక ఆసక్తితో ప్రణాళికా బద్ధంగా స్వయంగా తానే ప్లాన్ వేసుకొని డాబా పొలం నిర్మించుకున్నారాయన. 1,050 చదరపు అడుగుల విస్తీర్ణంలో మేడపైన మట్టి, ఎరువుల మిశ్రమం పోసి.. పండ్ల చెట్లు, పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు నిశ్చింతగా పెంచుతున్నారు. అక్కడక్కడా కొన్ని బ్యాగ్‌లలో బహువార్షిక చెట్లు పెంచుతున్నారు.

హన్మకొండ పట్టణంలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు సమీపంలోని ప్రేమ్‌నగర్ కాలనీలో శశికాంత్ కుమార్ (94407 91812) ఇల్లు ఉంది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడకుండా.. వర్మీ కంపోస్టు, వేప నూనె.. వాడుతూ ఇంటిపైనే పచ్చని తోటను పెంచుతున్నారు. ఈ మేడపై పరచుకున్న తోట ఆహ్లాదంతో పాటు ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందిస్తోంది.

ఇంటి అవసరాలకు మించి పండిన కూరగాయలు, ఆకుకూరలు ఇరుగు పొరుగు వారికీ ఇస్తున్నారు. బీర, సొరకాయ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ, టమాటా, వంగ, గుమ్మడితోపాటు పాలకూర, తోటకూర, చుక్కకూర, పుదీన, కొత్తిమీర, బచ్చలి, గోంగూర వంటి ఆకుకూరలను సైతం పండిస్తున్నారు. ఇతర రకాల కూరగాయలకు తప్ప మార్కెట్లో కొనాల్సిన అవసరం పెద్దగా రాదని ఆయన అంటున్నారు.


డాబా పొలం ఇలా....
రెండో అంతస్తు మేడపైన 6 అంగుళాల మందాన మట్టి మిశ్రమం పోశారు. ఎర్ర మట్టి, చెరువు మట్టి, వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు సమపాళ్లలో కలిపి మట్టి మిశ్రమం తయారుచేసి మేడపై ఆరంగుళాల మందాన పోసి మొక్కలు పెంచడం ప్రారంభించారు. చుట్టూ గోడల పక్కన 15 అంగుళాల మందాన మట్టి మిశ్రమం పోసి.. అందులో అంజూర, దేవగన్నేరు, మునగ, గులాబీలు, నిమ్మ తదితర చెట్లు పెంచుతున్నారు. కూరగాయలు, ఆకుకూరల మడులు కొన్ని ఏర్పాటుచేశారు. వృథా నీరు బయటకు వెళ్లడానికి చిన్న కాల్వలను ఏర్పాటు చేశారు. చెట్లు, మొక్కల చుట్టూ పరచుకున్న పచ్చని లాన్ ముచ్చటగొలుపుతూ.. మేడపైనే ఉన్నామా అన్నంతగా చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. వర్మీ కంపోస్టును తయారు చేయడానికి చెత్తాచెదారం, రాలిన ఆకులతో మేడపైనే ప్రత్యేకంగా రెండు బెడ్స్ ఏర్పాటుచేశారు.

ఈ ఎరువునే గార్డెన్‌కు వాడుతున్నారు. ఏడున్నరేళ్ల క్రితం టెరస్ ్రగార్డెన్ ప్రారంభించినప్పుడు తప్ప మళ్లీ ఎరువు కొనలేదు. ఎండలనూ తట్టుకొని పచ్చగా కనువిందుచేస్తున్నది ఈ విలక్షణమైన టెరస్ ్రగార్డెన్.



రేపే వనస్థలిపురంలో వర్క్‌షాప్

ఈ నెల 24వ తేదీన (ఆదివారం) సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ వనస్థలిపురంలోని (రెడ్ వాటర్ ట్యాంక్ దగ్గర) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్ జరుగుతుంది. సాక్షి, జాగృతి అభ్యుదయ సంఘం (94902 18903) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితం.

మరో ఏడాదిలో మట్టి మార్చేస్తాం

వ్యర్థ పదార్థాలతో తయారు చేసుకున్న వర్మీ కంపోస్టు, వేప నూనె తప్ప మొక్కలకు మరేమీ వాడం. టెరస్ ్రగార్డెన్ గురించి ఇల్లు కట్టడానికి ముందే ఆలో చన ఉండడం వల్ల.. బీమ్స్‌ను కూడా బలంగా వేశాం. మేడ మీద ప్లాస్టిక్ షీట్ వేసి మట్టి మిశ్రమం పోద్దామని మొదట అనుకున్నా.. నాలుగేళ్లలో ఆ షీట్ చీకిపోతే గార్డెన్‌ను తీసెయ్యాల్సి వస్తుందని ఆ ప్రయత్నం మానుకున్నాను.

బ్రిటన్ నుంచి స్నేహితుడి ద్వారా రసాయనాన్ని తెప్పించి మేడపై పూసిన తర్వాత.. నిశ్చింతగా మట్టిపోసి చెట్లు, మొక్కలు పెంచుతున్నాం. ఏడున్నరేళ్లుగా శ్లాబ్‌కు ఎటువంటి ఇబ్బందీ రాలేదు.

చెట్లు బాగా పెరిగిపోయా యి. మట్టి మిశ్రమం మొక్కల వేళ్లతో నిండిపోయింది. దీని వల్ల పోషకాలు సరిగ్గా అందక పూలు, కాయలు సరిగ్గా రాకపోవచ్చు. వచ్చే ఏడాది మట్టి మొత్తాన్నీ మార్చి.. చెట్లను కత్తిరించి తిరిగి నాటుదామనుకుంటున్నాను. అలాచేసినా గార్డెన్‌కు నష్టమేమీ ఉండదు.