ఇంటి పంట

అమృత మట్టి’తో నేల తల్లికి వందనం!
ఇంటి పంట 22 - 04 - 2011

నేల.. నేల తల్లి.. నేల తల్లి బాగుంటేనే.. ఆ తల్లి బిడ్డలమైన మనం బాగుంటాం.
అటువంటి తల్లి ఆరోగ్యాన్నే హరించే పనులు మనం చేస్తుంటే? ఇంకేముంది.. భవిష్యత్తు అంధకారమే!
ఈ హెచ్చరికనే ‘ధరిత్రి దినోత్సవం (ఏప్రిల్ 22)’ మరోసారి గుర్తుచేస్తోంది. అనాలోచిత మానవ చర్యల వల్ల కలుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించాలన్న బృహత్తర లక్ష్యంతో ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం.

ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్ల భూగోళం అమితంగా వేడెక్కిపోతోంది. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడడం వల్ల వాయుకాలుష్యం పెచ్చుమీరుతోంది. పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. వ్యవసాయంలో రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పదికాలాల పాటు పదిలంగా చూసుకోవాల్సిన భూమిని నిస్సారంగా మార్చుతున్నాం.

నేల అంటే నిర్జీవ పదార్థం కాదు. లక్షలాది సూక్ష్మజీవులు, పోషకాలతో కూడి ఉండేదే సుసంపన్నమైన నేల. దురదృష్టవశాత్తూ, వ్యవసాయం కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చేస్తున్నాయి. జీవం కోల్పోయిన నేలలో దిగుబడులూ నాసిగానే ఉంటాయి. దీర్ఘకాలంలో దిగుబడులు మరీ తగ్గిపోయి ఆహార సంక్షోభాలకు దారితీసే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఆలివర్ డి షుట్టర్ గుర్తించారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాల వైపు మళ్లడం తప్ప మరో మార్గం లేదని ఇటీవల నివేదించారు.

వ్యవసాయంలో రసాయనాలు వాడే విధానాలను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలకపాత్ర వహిం చింది అమెరికా. ధరిత్రి దినోత్సవం పేరిట పర్యావరణ పరిరక్షణ ఉద్యమం కూడా అమెరికాలోనే ప్రారంభం కావడం విశేషం. 41 ఏళ్ల క్రితం ఏప్రిల్ 22న గేలార్డ్ నెల్సన్ నేతృత్వంలో కాలుష్యకారక విధానాలకు నిరసనగా జనం ఉవ్వెత్తున ఉద్యమించారు. అప్పటి నుంచీ సుస్థిర అభివృద్ధి కోసం ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల పర్యావరణ అనుకూల చర్యలను చేపట్టాలన్నది ఈ ఏడాది ధరిత్రి దినోత్సవ నెట్‌వర్క్ లక్ష్యంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా చేపట్టదగిన పనుల్లో.. బడిలోనో, కమ్యూనిటీ స్థలంలోనో సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల సాగు చేపట్టడం కూడా ఒకటి!

చైతన్య కరదీపిక ‘ఇంటి పంట’
‘ఇంటి పంట’ శీర్షిక ద్వారా పాఠకుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించడానికి విస్తృత కృషి చేస్తోంది. వంటింటి వ్యర్థాలతో చక్కటి సేంద్రియ ఎరువు (కంపోస్టు లేదా అమృత మట్టి) తయారుచేయడంపై పాఠకులు చైతన్యవంతులవుతున్నారు. ఇంటి పంట స్ఫూర్తితో రాష్ట్రంలోనే కాకుండా బెంగళూరు తదితర ప్రాంతాల్లో కూడా ‘సాక్షి’ పాఠకులు తమ ఇళ్లలో కంపోస్టు తయారుచేయడం ప్రారంభించారు. కంపోస్టు తయారుచేసుకోవడమే కాదు.. ఆ కంపోస్టుతో ఇంటి పట్టునే కుండీల్లో, మడుల్లో రసాయనాలు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం కూడా ప్రారంభిస్తున్నారు. తమకున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? అని సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్‌ను చేపడుతున్నారు.

ఒక వైపు ఇంటి పట్టున వ్యర్థాలతో కంపోస్టు తయారుచేసుకుంటూనే.. మరో వైపు కంపోస్టును కొనుగోలుచేసి కూరగాయలు, ఆకుకూరలు వీలున్నంతలో ఇళ్ల దగ్గరే సాగుచేసుకుంటున్నారు. వారి వారి అనుభవాలను మెయిల్ ద్వారా పంచుకుంటున్నారు. నిపుణులను, తోటి కిచెన్ గార్డెనర్లను అడిగి తమకు వచ్చే సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. కొన్ని కాలనీల సంక్షేమ సంఘాలు కామన్ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కొందరు తమకు దగ్గర్లోని పాఠశాలల వద్ద పెరటి తోటల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బడికి అనుబంధంగా కూరగాయల సాగును ప్రారంభించాలనుకుంటున్నామని కొందరు చెపుతున్నారు. వ్యక్తులే కాదు ప్రభుత్వాధికారులు సైతం ‘ఇంటి పంట’కు స్పందిస్తున్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున పబ్లిక్ గార్డెన్స్‌లో రాలిన ఆకులతో చక్కగా కంపోస్టు దిబ్బలను ఏర్పాటుచేస్తున్నారు. ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ వెంకట్రామ్ రెడ్డి చొరవ తీసుకొని మొదట ఒక దిబ్బ ఏర్పాటుచేయించారు. ఆ ఉత్సాహం అంతటితో ఆగలేదు. పోగుపడుతున్న ఎండు ఆకులతో పచ్చి రొట్టను కలిపి కంపోస్టు దిబ్బలను ఏర్పాటు చేయిస్తున్నారు.

ఎండు ఆకులు వ్యర్థం కాదు.. ఇది గొప్ప వనరు అని అర్థమయ్యేలా సిబ్బందికి చెపుతూ ఉత్సాహపూరితంగా కంపోస్టు చేయిస్తున్నారాయన. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో పట్టణ వ్యర్థాలతో కంపోస్టు తయారుచేయడాన్ని ఇంటి పంట పాఠకులకు పరిచయం చేసిన తర్వాత అనేక మున్సిపాలిటీలలో ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నగరాలు, పట్టణాల్లో ఇంటి పంటలు పండించుకునే వారికి ఇన్‌పుట్స్ అందుబాటులోకి తేవడానికి కొన్ని సంస్థలు మౌలిక సదుపాయాలు కల్పించుకునే పనిలో ఉన్నాయి. తొలకరి నాటికి ఈ ప్రయత్నాలు కార్యరూపం దాల్చేఅవకాశం ఉంది.

అంతేకాదు.. సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు అనేక ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రైవేటు కంపెనీలు సైతం ముందుకొస్తున్నాయి.... ఇలా చెప్పుకుంటూ వెళితే ‘ఇంటి పంట’ స్ఫూర్తితో పర్యావరణానికి మేలుచేసే చర్యలకు ఎందరో పూనుకుంటున్నారు. పల్లెలు, పట్నాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వంటింటి వ్యర్థాలను తిరిగి వినియోగించడం.. రసాయనాలు వాడకుండా సహజమైన పద్ధతుల్లో ఇంటి పట్టునే కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడానికి ధరిత్రి దినోత్సవం సందర్భంగా అందరం పునరంకితమవుదాం. సమస్యలను అధిగమిస్తూ.. అనుభవాలను పరస్పరం పంచుకుంటూ ముందుకు సాగుదాం.. ధరిత్రిని పరిపరక్షించుకుందాం.. అర్బన్ అగ్రికల్చర్‌కు మౌలిక సదుపాయాలు కల్పించడానికి వీలుగా ప్రభుత్వంలో కదలిక మొలకెత్తుతుందని ఆశిద్దాం..



నేను ఐటీ ప్రొఫెషనల్‌ని. ‘ఇంటి పంట’ చదివి స్ఫూర్తి పొందా. ఆ రోజు నుంచే కంపోస్టు చేయడం.. ఆ తర్వాత కుండీల్లో ఆకుకూరలు పండించడం ప్రారంభించాను. బ్లాగ్ కూడా ప్రారంభించాను (https://organickitchengardening.wordpress.com).
-శ్రీలక్ష్మి, కోరమంగళ, బెంగళూరు

24న వనస్థలిపురంలో వర్క్‌షాప్
ఈ నెల 24వ తేదీన (ఆదివారం) సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ వనస్థలిపురంలోని (రెడ్ వాటర్ ట్యాంక్ దగ్గర) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్ జరుగుతుంది. ,jగృతి అభ్యుదయ సంఘం (94902 18903) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితం.