చీడపీడలతో వేగడం ఎలా?

చీడపీడలతో వేగడం ఎలా?
ఇంటి పంట 15 -04 -2011

కిచెన్ గార్డెనింగ్‌కు సంబంధించిన సమస్యల్లో చీడపీడల బాధ ఒకటి. కూరగాయలు, ఆకుకూరలు ఇంటి పెరట్లోనో, కుండీలోనో, మేడపైనో పెంచుకునే వారిని ఏదో ఒక స్థాయిలో పురుగులు, చీడలు చికాకుపెడుతూనే ఉంటాయి. ‘అసలు ఏ చీడపీడలూ రాకుండా ఉండి ఉంటే బాగుంటుంది కదా?’ అన్న భావన కలుగుతూ ఉంటుంది. మొక్కలన్నాక చీడలు, పురుగులు ఎంతో కొంత మేరకైనా కనిపించకుండాపోవు. అయితే, అవి చేసే నష్టం తీవ్రతలో తేడాలుండొచ్చు. మనం వాడుతున్న మట్టి.. మొక్కలు ఆరోగ్యదాయకంగా ఉన్నప్పుడు చీడపీడలు కనిపించినా పెద్దనష్టం కల గదు.

అంటే.. మొక్కల పోషణకు- చీడపీడల తాకిడికి మధ్య సంబం ధం ఉందన్న మాట. పెరట్లో, కుండీల్లో, మేడ మీద ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు పెంచుకునే వారందరూ గమనించాల్సిన చాలా ముఖ్యమైన అం శం ఇది. ‘ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఆశించిన చీడపీడలు ఆకిలితో మాడతాయి’ అని ఈ సిద్ధాంతం చెపుతున్న ప్రధానాంశం! సేంద్రియ ఎరువు లతో మొక్కలు ఆరోగ్యంగా పెరు గుతాయి.

చీడపీడలంటే పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు. చీడ పీడలు ఒక మొక్క మీద వృద్ధి చెందాలంటే ఆ మొక్కలో అధిక మోతాదులలో ‘నీటిలో కరిగి ఉన్న పోషకాలు’ ఉండాలి. ఎందుకంటే.. చీడ పీడలు మొక్కలోని మాంసకృత్తుల (ప్రొటీన్ల)ను నేరుగా తినలేవు. మాంసకృత్తులను జీర్ణం చేసుకునే ఎంజైమ్‌లు పురుగుల్లో ఉండవు. కాబట్టి వాటికి అవసరమైన అమినోయాసిడ్లు, చక్కెర, ఖనిజాలు మొక్కలోని రసంలో తగినంత మోతాదులో అందుబాటులో ఉన్నప్పుడు చీడపీడలు మొక్కలపై దాడిచేయడానికి వీలవుతుంది.

సాధారణంగా మొక్క పెరుగుదల సమయంలో వాటిలో అమినోయాసిడ్లు, చక్కెర వెంటనే మాంసకృత్తులుగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి, కణాలలోని రసాలలో అమినోయాసిడ్లు, చక్కెర చీడపీడలకు అవసరమైన మోతాదులలో దొరకవు. అటువంటప్పుడు మొక్కలను చీడపీడలు ఆశించినా.. తగిన ఆహారం లేక మాడతాయి. లేదా తమ సంతతి పెంచుకోలేక కునారిల్లుతూ కాలంగడుపుతూ ఉంటాయి.

అయితే.. చీడపీడలు రెండు సందర్భాల్లో విజృం భించే అవకాశం ఉంది. 1. మొక్కల్లో మాంసకృత్తుల తయారీకి ఏ కారణం వల్లనైనా ఆటంకం కలిగినప్పు డు. 2. మాంసకృత్తులు తయారుచేసుకోవడానికి అవసరమైన మోతాదుకంటే ఎక్కువ మోతాదుల్లో అమినోయాసిడ్లు, చక్కెరలు కణాల రసాల్లోకి చేరినప్పుడు. రసాయనాలు కొద్ది మోతాదుల్లోనయినా మొక్కల్లోకి ప్రవేశించినప్పుడు మాంసకృత్తుల తయారీ ప్రక్రియ కుంటుపడుతుంది. ఫలితంగా పోగుపడే అదనపు అమినోయాసిడ్లు, చక్కెరలను ఆహారంగా స్వీకరించి చీడపీడలు విజృంభిస్తాయి. రసాయనాల వాడకం వల్ల ఈ విధంగా చీడపీడల సమస్యను పరిష్కరించకపోగా పెంచడానికి దోహదపడుతుందన్నమాట.

పురుగులను పారదోలే పంటలు
ప్రత్యేకమైన వాసన కలిగి పురుగులను పారదోలే గుణమున్న కొన్ని పంటలు ఉన్నాయి. ఉదాహరణకు.. ఉల్లి మొక్కలకున్న ప్రత్యేకమైన వాసనను సీతాకోక చిలుకలు ఇష్టపడవు. క్యాబేజి మొక్కలతో పాటు ఉల్లిని కూడా కలిపి సాగుచేస్తే.. క్యాబేజిని ఆశించే పురుగులు తగ్గుతాయి. ఇలా ఉల్లిపాయ, క్యాబేజిలను కలిపి పండించటాన్ని సహపంటల విధానం అంటారు. పురుగులను నివారించటంలో ఈ సహపంటల విధానం బాగా పని చేస్తుంది.
-

రేపే పంజాగుట్ట ‘అరోరా’లో
‘ఇంటి పంట’ వర్క్‌షాప్

సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగుచేసుకోవడానికి సంబంధించిన అనేక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు పంజాగుట్టలోని అరోరా బిజినెస్ స్కూలులో 16వ తేదీ (శనివారం) సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకూ వర్క్‌షాప్ జరుగుతుంది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌కు నిమ్స్‌కు మధ్యలో.. ‘మోడల్ హౌస్’ పక్క రోడ్డులో అరోరా బిజినెస్ స్కూల్ (ప్రిన్సిపాల్ పాటూరి రవిని 99486 56599) ఉంది. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.

హ్యూమస్ దండిగా ఉంటే చీడపీడలు బాధించవు
పంటలకు చీడపీడల నిరోధక శక్తిని కలిగించడానికి ప్రకృతి ఒక అద్భుతమైన యంత్రాంగాన్ని అందించింది. నేలలో హ్యూమస్ (మొక్కలు, పశువుల వ్యర్థ పదార్థాలు కలిసి కుళ్లినప్పుడు.. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా సహాయంతో తయారయ్యే సేంద్రియ పదార్థం హ్యూమస్. ఇది ‘ఆకు ఎరువు’లో పుష్కలంగా ఉంటుంది) దండిగా ఉన్నప్పుడు ఈ యంత్రాంగం క్రియాశీలంగా ఉంటుంది; ఇది హ్యూమస్ లేని, లేదా నిస్సారమైన నేలల్లో పనిచెయ్యదు, అదే విధంగా రసాయనిక ఎరువులు వాడిన చోట కూడా పనిచెయ్యదు.

ఈ యంత్రాంగం పనిచెయ్యడానికి బాగా తయారుచేసిన, తాజా హ్యూమస్‌ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి, ఇదే దీనికి ఇంధనం. సారవంతమైన నేలలు రోగనిరోధక శక్తి కలిగిన పంటలను ఇస్తాయి. సారవిహీనమైన నేలలకు రసాయనిక ఎరువులు వేసినప్పటికీ పంట దిగుబడి పొందటానికి పురుగు మందులు, శిలీంధ్రనాశినుల సహాయం అవసరమవుతుంది.
- సర్ ఆల్బర్ట్ హవార్డ్,
సేంద్రియ వ్యవసాయ ఉద్యమ పితామహుడు
(‘జీవితానికి మూలాధారమైన వ్యవసాయం’ గ్రంథం నుంచి..)